మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఆడ్వాణీ

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 96 ఏళ్ల ఆడ్వాణీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ చివర్లో కూడా ఆయన అస్వస్థతకు గురవడంతో ఎయిమ్స్‌లో చేర్చారు. యూరాలజీ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత జులై మొదటివారంలో మరోసారి అనారోగ్యానికి గురవడంతో అపోలో ఆసుపత్రిలో రెండు రోజులు పాటు చికిత్స తీసుకున్నారు.