Delimitation: ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్..!

కేంద్ర ప్రభుత్వం జనగణన-2025కు (Cencus 2025) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణల్లో (Telangana) రాజకీయ, పరిపాలన రంగాల్లో సమూల మార్పులు తీసుకురానుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో శాసనసభ (Assembly), లోక్‌సభ (Loksabha) నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో (AP Reorganization Act) స్పష్టంగా పేర్కొంది. అయితే జనగణన ఆలస్యం కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కేంద్రం జనగణనకు ఆమోదం తెలపడంతో ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.
కేంద్ర హోం శాఖ సోమవారం జనగణన-2025కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జనగణన 2026లో పూర్తయ్యే అవకాశం ఉంది. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను సవరించడం, కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం ఈ ప్రక్రియలో భాగం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం, జనగణన ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణలో శాసనసభ, లోక్‌సభ స్థానాల సంఖ్య పెరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 26లో రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. అయితే, జనగణన జరగకపోవడంతో ఈ ప్రక్రియ అమలు కాలేదు. ప్రస్తుతం ఏపీలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలు, తెలంగాణలో 119 శాసనసభ, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం, ఏపీలో శాసనసభ స్థానాలు 225కి, తెలంగాణలో 134కి పెరగనున్నాయి. లోక్‌సభ స్థానాల సంఖ్య కూడా జనాభా నిష్పత్తి ఆధారంగా పెరగవచ్చు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైఎస్ఆర్‌సీపీలకు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు సరికొత్త సవాళ్లను, అవకాశాలను తీసుకొస్తాయి. కొత్త నియోజకవర్గాల్లో ఓటర్ల జాతి, కుల, సామాజిక నేపథ్యం ఆధారంగా పార్టీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల స్థానిక సమస్యలపై దృష్టి, పరిష్కార సామర్థ్యం పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.
పునర్విభజన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిర్వహిస్తుంది. జనగణన ఫలితాలు అందిన తర్వాత, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్ జనాభా, భౌగోళిక అంశాలు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తుంది. గతంలో 2002-2008 మధ్య జరిగిన పునర్విభజనలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో సరిహద్దులు సవరించబడ్డాయి. ఈసారి కూడా ఇలాంటి విస్తృత ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెరగడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రాతినిధ్యం మెరుగుపడుతుంది. ఓటర్లు తమ ప్రతినిధులతో సన్నిహితంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతం కీలకం. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పునర్విభజన రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈసీఐ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.