KTR: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసే ప్రయత్నం: కేటీఆర్

డీలిమిటేషన్‌పై (Delimitation) ప్రశ్నించకుంటే చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న కారణంగా డీలిమిటేషన్‌పై అందరూ కలిసి ఒక్కటిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం కేటీఆర్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘డీలిమిటేషన్ (Delimitation) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఘోరంగా అన్యాయం చేస్తోంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం భారత సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలను శిక్షించే విధంగా ఈ ప్రక్రియ ఉంది. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతే ప్రజా ప్రాతినిధ్యానికి భారీ దెబ్బతగిలినట్లే. ఇది కేవలం స్థానిక సమస్య కాదు… దేశవ్యాప్తంగా శాశ్వత రాజకీయ అసమానత్వానికి ఈ డీలిమిటేషన్ కారణమవుతుంది’’ అని కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ (Delimitation) విషయంలో నియంతృత్వం దిశగా కేంద్రం వెళ్తోందని కేటీఆర్ మండిపడ్డారు. “డీలిమిటేషన్ పేరుతో బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేయాలని చూస్తోంది. దీనిపై ఇప్పుడు నిలదీయకపోతే, భవిష్యత్తులో పశ్చాత్తాపమే మిగులుతుంది” అని ఆయన (KTR) హెచ్చరించారు.