Rahane: పవర్ చూపించిన రహానే

ఐపీఎల్ మ్యాచ్ లు మొదలయ్యాయి. కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతమైన హాఫ్ సెంచరీ తో రాణించటం ఇక మరో కీలక ఆటగాడు ఫిలిప్ సాల్ట్ కూడా దూకుడుగా పరుగులు చేయడంతో జట్టు విజయం అందుకుంది. ఇక బెంగళూరు బౌలింగ్ విభాగం కూడా ముందు కాస్త తడబడినట్లు కనపడిన ఆ తర్వాత మాత్రం దూకుడుగా ఆడింది.
ఆ జట్టు కీలక బౌలర్లు కీలక సమయంలో పరుగులను కట్టడి చేయడంతో భారీ పరుగులు చేస్తుందనుకున్న కోల్కతా 178 పరుగులతో ముగించింది. ఇదిలా ఉంచితే టెస్ట్ ప్లేయర్ గా ముద్రపడ్డ అజింక్య రహానే ఆడిన ఆట తీరు అభిమానులకు బాగా నచ్చేసింది. పవర్ ప్లే లో భారీ షాట్లతో రహానే విరుచుకుపడ్డాడు. ఫోర్లు సిక్స్ లతో ఈ సీనియర్ ఆటగాడు ఏమాత్రం కనికరం లేకుండా పరుగులు సాధించాడు. కలకత్తా ఆమాత్రం పరుగులు సాధించిందంటే కారణం రహానే బ్యాటింగ్.
దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇండియా టీం సెలక్షన్ కమిటీ పై కూడా ఆరోపణలు చేస్తున్నారు అభిమానులు. టెస్ట్ క్రికెట్లో మిడిల్ ఆర్డర్లో రహానే అత్యంత కీలక ఆటగాడు. ముఖ్యంగా ఓవర్సీస్ మైదానాలపై అతనికి మంచి రికార్డు ఉంది. అలాంటి ఆటగాడిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిడిల్ ఆర్డర్లో రహనే ఉంటే కచ్చితంగా భారత జట్టుకు కలిసి వచ్చి ఉండేదని.. కీలక మ్యాచ్లో విజయం సాధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తిరిగే కైవసం చేసుకునేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రహానే ఇలాగే ఫామ్ కొనసాగించాలని.. అతన్ని ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు.