ఖాదీ దుస్తులు కొనండి.. మోదీ

గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. గతంతో పోలిస్తే వీటి విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఖాదీ, చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలా మంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి’ అని మోదీ చెప్పారు. ‘‘ఒడిశాకు చెందిన సంబల్ పురి సారీ, కశ్మీర్‌కు చెందిన కానీ షాల్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన మహేశ్వరీ సారీలు హ్యాండ్లూమ్ ప్రపంచంలో ఎంతో పేరును గడించాయి’’ అని మోడీ గుర్తు చేశారు. ప్రజా కళలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ప్రాజెక్ట్ ‘పరీ’ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రోడ్ల పక్కన, గోడలపై కళాకారులు వేసే అద్భుతమైన పెయింటింగ్స్ పబ్లిక్ ప్లేసులను మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నాయని ప్రధాని కొనియాడారు.