Chiranjeevi: కేంద్రంలో చిరంజీవికి కీలక పదవి ఖాయమా..?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో సుపరిచితులు. తెలుగువారిపై ఆయన ముద్ర చెరపలేనిది. నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీరంగాన్ని శాసిస్తున్నారనే చెప్పాలి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే అక్కడ ఇమడలేని పరిస్థితుల్లో బయటకు వచ్చేసి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు. కానీ మరోసారి చిరంజీవి (Megastar Chiranjeevi) నోట రాజకీయ ప్రసంగాలు వినే సమయం వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. త్వరలోనే ఆయనకు కేంద్రంలో కీలక పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దశాబ్దాలపాటు సినీరంగంలో తనదైన ముద్ర వేసుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (Prajarajyam Party) ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే దాన్ని చాలాకాలంపాటు నడపలేకపోయారు. దీంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అందుకుగానూ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ (Congress Party) కేంద్రంలో మంత్రి పదవిని (Central Minister) కట్టబెట్టింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ చిరంజీవికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అందరివాడుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా చిరంజీవి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో (Sankranthi Celebrations) పాల్గొన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆద్యంతం ప్రధాని మోదీ (PM Modi).. చిరంజీవిని పక్కన పెట్టుకున్నారు. జ్యోతి ప్రజ్వలనలో కూడా చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవితో మోదీ ముచ్చటిస్తున్న దృశ్యాలు పలుమార్లు కనిపించాయి. దీంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలంగాణలో (Telangana) చిరంజీవి సేవలను వాడుకునేందుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తోందని కొందరు భావిస్తున్నారు.
అయితే ఏపీలో చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా (Dy. CM Pawan Kalyan) ఉన్నారు. ఆయన బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏది అడిగినా ప్రధాని మోదీ కాదనే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ అంటే మోదీకి అత్యంత అభిమానం. అందుకే చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా (Rajyasabha MP) నామినేట్ చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని.. ఇందుకు మోదీ కూడా సుముఖత వ్యక్తం చేశారని కొంతకాలం కిందటే వార్తలొచ్చాయి. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారోత్సవంలో కూడా మోదీని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ప్రధాని మోదీతో చిరంజీవి పాల్గొనడం.., ఆయనకు మోదీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.