ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు కల్పించిన వర్క్ ఫ్రమ్ హోం విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడప్పుడే ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయబోమని సీఈవో సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము అవలంబిస్తున్న హైబ్రిడ్ పని విధానం ( కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి ) వల్ల ఎలాంటి ఇబ్బంది రావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కచ్చితంగా ఇన్ని రోజులు ఆఫీసుకు రావాలని కూడా నియమం పెట్టబోమన్నారు. ఇంటి నుంచి పని విధానంపై ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల స్పందన బాగుందని తెలిపారు.
ప్రస్తుతం భారత్లోని తమ ఆఫీసుల్లో ఏ సమయంలోనైనా 45 వేలకు తగ్గకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. పైగా ఇది క్రమంగా పెరుగుతోందన్నారు. అలాగే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. ఫలితంగా ఎక్కువ మంది ఆఫీసుకు రావడాన్ని ప్రోత్సహిస్తామన్నారు. కొన్ని సందర్భాల్లో క్లయింట్ల అవసరాన్ని అనుగుణంగా ఉద్యోగులు నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు.






