వంద కోట్లు కాదు… 150 కోట్ల ఇండియా!

వంద కోట్ల భారత్ కాదు. ఇప్పుడిక 150 కోట్ల ఇండియా. ఇలా పిలుచుకోవాల్సిందే. అయితే, ఇందుకోసం మరో పుష్కర కాలం ఆగితే చాలు. అప్పటికి మన దేశ జనాభా 150 కోట్లు దాటేయనుంది. అలాగే మహిళల సంఖ్య కూడా స్వల్పంగా పెరగనుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2036 నాటికి భారత దేశ జనాభా 152.2 కోట్లకు చేరనుంది. అలాగే, మహిళల సంఖ్య కూడా 48.5 శాతం ( 2011) నుంచి 48.8 శాతానికి పెరగనుంది. భారత్‌లో మహిళలు, పురుషులు 2023 పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో 2011-2036 మధ్య కాలంలో 15 ఏళ్లలోపు వ్యక్తుల సంఖ్య బాగా తగ్గిపోనుంది. అదే సమయంలో 60 ఏళ్లు ఆపై వయసు గల వారి సంఖ్య పెరుగనుంది. ఇక మహిళలు` పురుషుల నిష్పత్తిలో కూడా 2022 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉంటే 2036 నాటికి అది 952కు చేరనుంది.