Marriage: మేనకోడలి పెళ్లి ఇష్టం లేక రిసెప్షన్ లో విషం

తన అనుమతి లేకుండా మేనకోడలు పెళ్లి చేసుకోవడంపై మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. ఆమె పెళ్లి రిసెప్షన్ కు వచ్చిన అతిథులపై విషప్రయోగం చేయాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అయింది. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra) లోని కొల్హాపూర్ జిల్లా ఉట్రే గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఉట్రే గ్రామంలో జరిగిన వివాహ రిసెప్షన్ పై ఆగ్రహంగా ఉన్న పెళ్లి కూతురు మామ మహేశ్ పాటిల్.. తన మేనకోడలు వివాహ రిసెప్షన్ ను జరిగే కళ్యాణ మండపం గేట్‌ను బద్దలు కొట్టి.. ఆహారంలో విషం కలపాలి అనుకున్నాడని.. అక్కడ సినీ ఫక్కీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.
అయితే రిసెప్షన్‌లో ఎవరూ ఆహారం తీసుకోకపోవడంతో అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహేష్ ఆహారంలో విషం కలుపుతుండగా, అక్కడ ఉన్న వ్యక్తులు అతన్ని అడ్డుకున్నారు. అయితే, అతను అక్కడి నుండి పారిపోయాడని జాతీయ మీడియా పేర్కొంది. మహేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతను విషం కలిపిన ఆహారాన్ని పరీక్షల కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. వధువు గ్రామానికి చెందిన వ్యక్తితో పారిపోయి వివాహం చేసుకోవడం నిందితుడికి అసలు ఇష్టం లేదని.. పన్హాలా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ మహేష్ కొండుభైరి జాతీయ మీడియాకు వివరించారు.
మేము అతనిపై సెక్షన్లు 286 (విషపూరిత పదార్ధాలకు సంబంధించి నిర్లక్ష్య ప్రవర్తన), 125 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), భారతీయ న్యాయ సంహిత (BNS)కు సంబంధించి.. ఇతర సంబంధిత చట్టాల ప్రకారం నేరాన్ని నమోదు చేసామని ఆయన వివరించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఆయన వివరించారు. పెళ్లి కూతురు అతని ఇంటి వద్దే పెరిగిందని.. అయితే ఆమె ఇటీవల గ్రామంలోని ఒక వ్యక్తితో పారిపోయి అతనిని వివాహం చేసుకోవడం పాటిల్ కు ఇష్టం లేదని.. అందుకే మంగళవారం కళ్యాణ మండపం గేట్ క్రాష్ చేసి అతిధుల కోసం తయారు చేస్తున్న ఆహార పదార్థాల్లో విషపదార్థాన్ని కలిపాడని పోలీసులు పేర్కొన్నారు.