Jammu Kashmir: రెండు సంస్థలపై కేంద్రం నిషేధం

జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) కేంద్రంగా పని చేస్తోన్న రెండు సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం -1967 ప్రకారం ఆవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee) , జమ్మూకశ్మీర్ ఇత్తిహదుల్ ముస్లిమీన్ (Ittihadul Muslimeen) గ్రూపులను ఐదేళ్ల పాటు నిషేధిత సంస్థలుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) కి ఉమర్ ఫరూక్ (Umar Farooq) నేతృత్వం వహిస్తుండగా, జమ్మూ కశ్మీర్ ఇత్తిహదుల్ ముస్లిమీన్ (జేకేఐఎం) సంస్థను మస్రూర్ అబ్బాస్ అన్సారీ (Masroor Abbas Ansari ) నడిపిస్తున్నారు.
ఈ రెండు సంస్థలకు చెందిన సభ్యులు జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టేలా, ఉగ్రవావాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, భారత వ్యతిరేక ప్రాచారంలో పాల్గొన్నంటున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు హాని కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని ఈ రెండు సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.