విమాన టికెట్ ధరలపై.. కేంద్రం హెచ్చరిక

పండగల సీజన్ వచ్చిందంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వారంతా సొంతూళ్లకు పయనమవుతుంటారు. అదే అదనుగా ఆ సమయంలో విమాన టికెట్ల ధరలు ఆకాశన్నంటుతుంటాయి. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. టికెట్ ధరలపై ఒక కన్నేసి ఉంచినట్లు తెలిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పండగ సీజన్‌లో ఎక్కువమంది ప్రయాణించే మార్గాల్లో విమానయన సంస్థలు వసూలు చేస్తున్న టికెట్ ధరలను మేం గమనిస్తున్నాం. పండగ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లాలని కోరుకుంటారు. అలాంటి వేళ ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదని ఇప్పటికే అన్ని విమానయాన సంస్థలకు చెప్పాం. ఏ సంస్థా ఒక విధమైన టికెట్ ధర వసూలు చేయాలని ఒత్తిడి చేయం. అయితే ధరలు మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు.