Jagdeep Dhankhar: ప్రజాస్వామ్యంలో కార్యనిర్వహణ వ్యవస్థ కీలకం: జగదీప్ ధన్‌ఖర్

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానిదే అంతిమాధికారం అని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) స్పష్టం చేశారు. పాలన అనేది కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుందని, న్యాయస్థానాలు పాలనను నిర్దేశించలేవని తేల్చిచెప్పారు. నీట్ పరీక్ష వికేంద్రీకరణ విషయంలో వచ్చిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో, డీఎంకే సభ్యురాలు కనిమొళి “నీట్ (NEET) వికేంద్రీకరణ చేయాలి. రాష్ట్రాలకు ఈ పరీక్ష నిర్వహించుకునే అధికారాన్ని ఇవ్వాలి” అని కోరారు. ఈ డిమాండ్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. గతంలో సుప్రీం కోర్టు “నీట్ కేంద్రీకరణను సమర్థించిందని” ఆయన గుర్తుచేశారు. దీనిపై స్పందించిన ధన్‌ఖర్ (Jagdeep Dhankhar).. “ప్రజాస్వామ్యంలో పాలన కార్యనిర్వహణ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. పార్లమెంటుకు ఎగ్జిక్యూటివ్ విభాగం జవాబుదారీగా ఉంటుంది. పాలనను మిగతా వ్యవస్థలు ఎలా నిర్వహిస్తాయి?” అని అడిగారు.