Nitin Gadkari: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కార్పొరేట్ వర్గాలకు నితిన్ గడ్కరీ విజ్ఞప్తి

జీఎస్టీ, ఇతర పన్నులు (Taxes) తగ్గించాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని అడగొద్దని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కోరారు. పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరమని, కావున జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించమని అడగొద్దన్నారు. ఒకసారి పన్నులు తగ్గిస్తే మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటారని, ఇది మనుషుల మనస్తత్వమని ఆయన అన్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని, కానీ దాని వల్ల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన (Nitin Gadkari) వివరించారు.
ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేయడం, ఆ డబ్బును పేదల కోసం వినియోగించడం ప్రభుత్వ దార్శనికత అని గడ్కరీ చెప్పారు. ఇదే సమయంలో పరిశ్రమలు చెల్లించే లాజిస్టిక్స్ ఖర్చును మరో రెండేళ్లలో 9 శాతానికి తగ్గిస్తామని ఆయన (Nitin Gadkari) హామీ ఇచ్చారు. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతం ఉందని, అదే యూఎస్, యూరప్ దేశాల్లో ఇది 12 శాతం ఉందని ఆయన తెలిపారు. దాన్ని భారత్ లో 9 శాతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచుకోల్సిన అవసరం ఎంతో ఉందని గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు.