Farooq Abdullah: అప్పుడు నేను జైల్లో ఉన్నా: ‘రా’ మాజీ చీఫ్‌పై ఫరూక్ అబ్దుల్లా ఫైర్

జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన ఆర్టికల్ 370 రద్దుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) మద్దతిచ్చారని ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ ఆరోపించారు. బహిరంగంగా ఈ బిల్లుపై పోరాడినప్పటికీ అంతర్గతంగా కేంద్రానికే ఫరూక్ అబ్దుల్లా మద్దతు ఇచ్చారని దౌలత్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన సమయంలో తాను జైలులో ఉన్నానని గుర్తుచేశారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తిరిగి తీసుకురావడానికి తమ పార్టీ ఎంత కృషి చేస్తుందో ప్రజలందరికీ తెలుసని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. తనను నిజంగా స్నేహితుడిగా భావించినట్లయితే, దౌలత్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవారు కాదని ఆయన (Farooq Abdullah) ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, 1996లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలని తనను అడిగినట్లు దౌలత్ తన పుస్తకంలో రాశారని, ఇవన్నీ అతని చౌకబారు చర్యలకు నిదర్శనమని ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. తన పుస్తకం అమ్మకాలను పెంచుకోవడం కోసమే దౌలత్ ఇలాంటి అసత్య ఆరోపణలు చేశారని ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు.
“ద చీఫ్ మినిస్టర్ అండ్ ది స్పై” అనే తన పుస్తకంలో, మాజీ రా చీఫ్ ఏఎస్ దౌలత్ ఫరూక్ అబ్దుల్లా గురించి కీలకమైన విషయాలను వెల్లడించారు. “బహిరంగ సభల్లో మోదీ ప్రభుత్వంపై ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తీవ్ర విమర్శలు గుప్పించేవారు. కానీ అంతర్గతంగా ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారు. మోదీ ప్రభుత్వం చర్యలపై ఆయన అనేకసార్లు సానుకూలంగా స్పందించారు. ఈ బిల్లుకు మద్దతు తెలపడంలో తప్పేంటి? దీనిపై మనమెందుకు విశ్వాసం ఉంచకూడదు?” అని ఫరూక్ అబ్దుల్లా తనను అడిగారని దౌలత్ పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతిపక్షాలు దౌలత్ మాటలు నిజమే అయ్యుంటాయని అనుమానం వ్యక్తం చేశాయి. ఫరూక్ అబ్దుల్లాకు (Farooq Abdullah) దౌలత్ సన్నిహితుడని, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన అనేక విషయాలు అతనికి తెలుసుంటాయని వారు అంటున్నారు.