Smriti Irani: నటిగా రీఎంట్రీ ఇవ్వనున్న కేంద్ర మాజీ మంత్రి?

రాజకీయాల్లోకి రాకముందు సినీ, సీరియల్ నటిగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani). రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఆమె యాక్టింగ్ (Acting) కు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె తిరిగి నటిగా రాణించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఒక సిరీస్ కోసం వర్క్ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఏక్తా కపూర్ (Ekta Kapoor) రూపొందించిన క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్ ఆమెకు నటిగా ఎంతగానో గుర్తింపు తెచ్చి పెట్టింది. కాగా, ఇప్పుడు సీరియల్‌ను సిరీస్‌గా సిద్ధం చేయాలని ఏక్తా కపూర్ భావిస్తున్నారట. ఎక్కువ ఎపిసోడ్స్ లేకుండా పరిమితమైన ఎపిసోడ్స్‌తో దీనిని మరోసారి ప్రేక్షకులకు అందించాలని ఆమె ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సీరియల్‌లో ప్రధాన పాత్రలు పోషించిన స్మృతి ఇరానీ, అమర్ ఉపాధ్యాయ్‌నే సిరీస్ కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు ఈ విషయమై ఇప్పటికే వారిని సంప్రదించినట్లు తెలిసింది. ఏక్తాకపూర్ కోరిక మేరకు మరోసారి కెమెరా ముందు యాక్టింగ్ చేసేందుకు స్మృతి అంగీకారం తెలిపారని, తులసి (Tulasi) పాత్ర కోసం ఆమె సన్నద్ధం అవుతున్నారనే ప్రచారం జోరుందుకుంది.