Delhi: సోషల్ మీడియా ప్రచారస్త్రం.. దూసుకుపోతున్న ఆప్, బీజేపీ సైబర్ సైనికులు..

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో (Delhi Assembly Elections) రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార ఆమ్ ఆద్మీ (AAP) పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. బీజేపీ (BjP), కాంగ్రెస్ (Congress) విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం కొనసాగుతోంది. అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేలా ఓ పార్టీ వీడియోలు పెడుతుంటే.. దానిని విమర్శిస్తూ ప్రత్యర్థి పార్టీ మరో వీడియోను పోస్టు చేస్తోంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా పార్టీలు వదులుకోవడం లేదు.
అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆప్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని ఎత్తిచూపింది. దీనికి దీటుగా స్పందించిన కమలం పార్టీ.. దేశ రాజధానిలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని..ఢిల్లీ ప్రజలకు వచ్చిన ఆపద తొలగిపోతుందని సూచిస్తున్న పోస్టర్‌ను షేర్ చేసింది.
ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి, ఢిల్లీకి ఓ ఆపదగా మారిందని ప్రధాని మోడీ ఇటీవల విమర్శలు గుప్పించారు. దీనికి కేజ్రీవాల్ అదేస్థాయిలో కౌంటరిచ్చారు. అసలు సమస్య బీజేపీలోనే ఉందని ఎదురుదాడికి దిగారు. మొదటి సమస్య బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం, రెండోది సరైన ఆలోచన లేకపోవడం, మూడోది అజెండా లేకపోవడం అని దుయ్యబట్టారు.
ఈసారి కూడా ఢిల్లీలో ఆప్ సర్కార్ కొలువుదీరితే.. అది ప్రధానిమోడీ, బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఎందుకంటే పక్కనే ఉన్న ఓ ప్రాంతీయ పార్టీని ఓడించలేని పరాభవం .. ఆపార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు.. ఇప్పటికే జాతీయపార్టీగా మారిన ఆప్.. మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశముంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ లకు కూడా ప్రమాదకరమని చెప్పాలి. ఎందుకంటే కేజ్రీవాల్ వ్యూహాల ముందు ఈ రెండు జాతీయ పార్టీలు నిలవలేకపోతున్నాయని చెప్పక తప్పదు