Congress: రేపటి నుంచి కాంగ్రెస్ ‘‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’’ ప్రచారం..

Congress: అధికార బీజేపీపై దాడిని మరింత తీవ్రతరం చేసేదిశగా కాంగ్రెస్ అడుగులేస్తోంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ (Jai Bapu Jai Bhim Jai Samvidhan) పేరుతో ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా జనవరి 26న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్(Ambedkar) జన్మించిన మధ్యప్రదేశ్‌లోని మహౌ పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించనుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగిడుతున్నసందర్భంగా జనవరి 26న మహౌలో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
“ప్రచారంలో పాదయాత్రలు, గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాలీలు ఉంటాయి. జాతీయ, రాష్ట్ర, జిల్లా మరియు అట్టడుగు స్థాయిలలోని అన్ని స్థాయిల నాయకులు దీనికి నాయకత్వం వహిస్తారు. సెమినార్లు వంటి కార్యకలాపాలు, బహిరంగ సభలు, ర్యాలీలు ఒక గ్రామం నుంచి మరో గ్రామం వరకు జరుగుతాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలోనే, కాంగ్రెస్ 2025 జనవరి 26న ఏడాదిపాటు ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను ప్రారంభించనుందని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు.మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ ప్రచారం ప్రారభించబోతున్నారు.
ఈ ప్రచారాన్ని వచ్చే రెండేళ్ల పాటు కొనసాగించనుంది కాంగ్రెస్. 2026 జనవరి 26 వరకు సమాజంలోని వివిధ సమస్యలను పరిష్కరించడంలో రాజ్యాంగ ప్రాధాన్యతను తెలియజేసే కార్యక్రమాలు ఉంటాయని కాంగ్రెస్ తెలిపింది. బలమైన సందేశంతో ఈ ప్రచారం దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని అభిప్రాయపడింది.
వాస్తవానికి డిసెంబరు నెలాఖరులో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలోనే ఈ ప్రచార కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం.. 2025 జనవరి 26 నుంచి 2026 జనవరి 26 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఈ పాదయాత్ర గ్రామ, పట్టణ స్థాయుల్లో జరగనుంది. 2025 ఏప్రిల్ రెండోవారంలో గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలు జరుగుతాయి.
బీఆర్ అంబేద్కర్‌ని బీజేపీ అవమానపరిచిందని , పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ రాజ్యాంగాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారానికి కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ మాత్రం అంబేద్కర్ వ్యాఖ్యల వివాదంపై కాంగ్రెస్ తీరును తప్పుబడుతోంది. అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ దుయ్యబడుతోంది.