CEC Rajiv Kumar: ‘ఉచిత హామీల’ నియంత్రణకు చట్టం అవసరం: సీఈసీ రాజీవ్ కుమార్

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar).. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ‘ఉచిత హామీ’లను నియంత్రించేందుకు చట్టపరమైన వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే ఆయన సీఈసీ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఇదే సీఈసీగా తన చివరి ప్రెస్‌మీట్ అన్న ఆయన.. రిటైర్మెంట్ తర్వాత తనకు కొంచెం ఏకాంతం కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకోసం పదవీ విరమణ తర్వాత అందరికీ దూరంగా వెళ్లిపోతానని, హిమాలయాలకు వెళ్లి నాలుగైదు నెలలు అక్కడే ఏకాంతంగా గడుపుతానని రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) చెప్పారు. అనవసర అంశాలకు పూర్తిగా దూరంగా ఉంటానన్నారు. అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో పంచుకున్న ఆయన.. తాను మున్సిపల్ స్కూల్లో చదువుకున్నానని, ఏబీసీడీలను ఆరో తరగతిలో నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. అందుకే అణగారిన వర్గాల చిన్నారులకు చదువు చెప్పడం అంటే తనకు ఇష్టమన్నారు.