Robert Vadra: గాంధీ కుటుంబీకుడిని కాబట్టే బీజేపీ టార్గెట్ చేస్తోంది: రాబర్ట్ వాద్రా

గాంధీ కుటుంబానికి అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబార్ట్ వాద్రా (Robert Vadra).. తనపై జరుగుతున్న ఈడీ విచారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హరియాణా భూముల లావాదేవీల మనీలాండరింగ్ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విచారణపై స్పందించిన వాద్రా.. తను గాంధీ కుటుంబానికి చెందిన వాడిని కాబట్టే తనను ఇలా టార్గెట్ చేశారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా త్వరలోనే తను రాజకీయాల్లోకి వస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. వాద్రా వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. “నేను నిరంతరం ప్రజల కోసం పోరాడే గాంధీ కుటుంబానికి చెందిన వాడిని. కాబట్టి సహజంగానే నన్ను, నా కుటుంబాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కూడా వారు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మీరు (బీజేపీ) ఎంత ఇబ్బంది పెడితే, మేము అంత బలంగా ఎదుగుతాము. ఎదురయ్యే ప్రతి సవాళ్లను మేం అధిగమిస్తాం. కానీ ఇలా దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపేవారిపై ఒత్తిడి తెచ్చేందుకు వాటిని దుర్వినియోగం చేస్తుండటంతో ప్రజల్లో ఆ సంస్థలపై నమ్మకం పోతుంది. నేను బీజేపీలో ఉంటే ఈ విచారణలు ఉండేవి కావు, పరిస్థితి భిన్నంగా ఉండేది. ప్రజలు మా వెంట ఉన్నారు. నేను రాజకీయాల్లోకి రావాలని వారు కోరుకుంటున్నారు” అని వాద్రా (Robert Vadra) అన్నారు.
అలాగే, హరియాణాలో భూములకు సంబంధించిన కేసులో తనకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇచ్చిన విషయాన్ని వాద్రా గుర్తు చేశారు. 2019లోనే ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, మళ్లీ అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈడీ కేసు ప్రకారం, వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుండి కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 7.5 కోట్లు. ఆ తర్వాత, వాద్రా (Robert Vadra) కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు రూ. 58 కోట్లకు విక్రయించింది. డీఎల్‌ఎఫ్‌కు భారీ లాభంతో విక్రయించడం వల్ల మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణ జరుగుతోంది.