Manish Sisodia : జైల్లో ఉన్నప్పుడు నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు

భారతీయ జనతాపార్టీ పై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీహార్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ (BJP) తనకు ముఖ్యమంత్రి పదవి (Chief Minister’s post) ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మీడియాతో సిసోడియా మాట్లాడుతూ జైల్లో తాను ఇబ్బందులు పడుతున్న విషయం బీజేపీకి అర్థమైందన్నారు. దానికి తోడు తన భార్య అనారోగ్యం బారినపడటం, కుమారుడు చదువుకుంటున్నాడని తెలిసి వాళ్లు తనకు బీజేపీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. అలా చేస్తే ఆప్ కూటమిని విచ్చిన్నం చేస్తామని, ఆ తర్వాత తనను సీఎంను చేస్తామని బీజేపీ నేతలు చెప్పినట్లు తెలిపారు. దీనికి అంగీకరించకుంటే సుదీర్ఘకాలంపాటు జైల్లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను వదిలెయ్ లేదంటే జైల్లోనే మగ్గిపో అంటూ అల్టిమేటం జారీ చేశారని ఆరోపించారు.