Poster war: హస్తినలో పోస్టర్ వార్.. ఆప్, బీజేపీ పొలిటికల్ ఫైట్…

ఢిల్లీలో వరుస విజయాల పరంపరను కొనసాగించాలని ఆప్(AAP), చీపురును బయట పడేయాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. ఏఒక్క ఛాన్స్ లభించినా అస్సలు వదలడం లేదు. తగ్గేదే లే అంటూ పాచికలు విసురుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్(kejriwal) ను అరెస్ట్ తో ఆప్ డౌనవుతుందని బీజేపీ నేతలు భావించగా.. నేలకు కొట్టిన రబ్బరుబంతిలా అంతే వేగంగా దూసుకొచ్చారు కేజ్రీవాల్. ఇప్పుడు తన అరెస్టును సైతం ఢిల్లీ నేలపై ప్రచారాస్త్రంగా మార్చేశారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమ్‌ఆద్మీపార్టీ (AAP), బీజేపీ (BJP) వినూత్న ప్రచారం చేస్తున్నాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తిచూపుతూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ విడుదల చేసిన పోస్టర్‌కు ఆప్ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చింది (Delhi Elections).ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఒకే అడ్రస్‌లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ ఎక్స్ వేదికగా ఆరోపించింది. ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ ఓటర్లను రిజిస్టర్ చేస్తున్నారని దుయ్యబట్టింది. ఇది కేజ్రీవాల్ కొత్త గేమ్ అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ఆప్‌నకు నకిలీ ఓటర్లపై ప్రేమ అనే అర్థం వచ్చేలా ఒక పోస్టర్‌ను షేర్ చేసింది. దీనికి ఆప్ కౌంటర్ ఇచ్చింది. ఆ విమర్శను తిప్పి కొడుతూ ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) అంటూ కేజ్రీవాల్ ఉన్న ఒక పోస్టర్ వీడియోను పంచుకుంది.
ఢిల్లీలో ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది.ఈమేరకు అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భాగవత్‌కు లేఖ రాశారు. కమలం పార్టీ చేస్తున్న తప్పిదాలను ఆరెస్సెస్ ఆమోదిస్తుందా? అని అందులో ప్రశ్నించారు. ఇలా మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం ఆరెస్సెస్(RSS) అధ్యక్షుడికి లేఖ రాయడానికి బదులు ఆ సంస్థ నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్‌కు హితవు పలికింది బీజేపీ.దేశ రాజకీయాల్లోనే ఆప్ అవిశ్వసనీయ పార్టీకి ఉదాహరణ అని, దీనిని ప్రజలు అర్థం చేసుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఎదురుదాడి చేశారు.