Aurangzeb: మహారాష్ట్రలో ‘ఔరంగజేబు సమాధి’పై అల్లర్లు.. స్పందించిన ఆర్‌ఎస్ఎస్

మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Aurangzeb) సమాధిని తొలగించాలని డిమాండ్‌పై అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. నాగ్‌పుర్ (Nagpur)లో ఇటీవలే ఒక వర్గం వారు హింసాకాండకు పాల్పడ్డారు. పోలీసులను దూషిస్తూ.. అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో చాలామంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ఈ హింసను ఖండించింది. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. ‘‘ఔరంగజేబు (Aurangzeb) సమాధి అనేది చారిత్రక అంశం. నేటి ప్రపంచానికి ఈ సమస్య వల్ల ఎలాంటి లాభం లేదు. కేవలం ఈ సమస్యను చూపించి హింసకు తెగించడం మాత్రం సమాజానికి హానికరం. సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇలా గొడవలు సృష్టించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు (Aurangzeb) సమాధి వద్ద భద్రతను పెంచారు. సందర్శకుల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు.