Ashwini Vaishnaw: ‘హైపర్‌లూప్’ టెక్నాలజీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

హైపర్‌లూప్ (Hyperloop) ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) చెప్పారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా స్పందించిన ఆయన.. హైపర్‌లూప్ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, భద్రతా ప్రమాణాలు ఇంకా అంతర్జాతీయంగా నిర్దేశించాల్సి ఉందని తెలిపారు. ‘‘ఇది ఇతర రవాణా విధానాల కంటే వేగంగా, శక్తిమంతంగా, స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైపర్‌లూప్ (Hyperloop) టెక్నాలజీలో ఎక్సలెన్స్ సెంటర్‌ను నెలకొల్పేందుకు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO).. ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది,’’ అని వివరించారు.
ఈ ప్రాజెక్టు కోసం రూ.20.89 కోట్ల నిధులను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. హైపర్‌లూప్‌ను (Hyperloop) రవాణా రంగంలో ఐదో విధానంగా అభివర్ణిస్తారు. ఇది అధిక వేగంతో సుదూర ప్రయాణాలు చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వ్యవస్థ. ఖాళీ గొట్టాల్లాంటి ట్యూబ్‌లలో రైలు బోగీలను పోలిన ప్రత్యేకమైన పాడ్‌లు ప్రయాణిస్తాయి. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను వినియోగించడం వల్ల పాడ్‌లు పట్టాలను తాకకుండా కొంత ఎత్తులో తేలుతూ ప్రయాణిస్తాయి. గాలి నిరోధకత లేనందున వేగాన్ని కోల్పోకుండా తక్కువ శక్తితో అత్యధిక దూరాన్ని వేగంగా కవర్ చేయగలవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గంటకు 1000 కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ వేగాన్ని ఈ హైపర్‌లూప్ (Hyperloop) పాడ్‌లు అందుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.