తిహాడ్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదల

ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి విదలయ్యారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం విడుదలకు అవసరమైన ప్రక్రియ పూర్తి కావడంలో బెయిల్ మంజూరైన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆప్ శ్రేణులు, కేజ్రీవాల్ అభిమానులు జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. వర్షం కురుస్తుండగా తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారందరికీ కేజ్రీవాల్ అభివాదం చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇంత వర్షంలోనూ పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితం దేశానికే అంకితం. లైఫ్‌లో ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొన్నా. కానీ సత్యమార్గంలోనే నడిచాను. అందుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను జైలులో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని కొందరు అనుకున్నారు. నేను జైలు నుంచి బయటకు వచ్చాక నా ధైర్యం 100 రెట్లు పెరిగింది. భగవంతుడు చూపిన మార్గంలోనే నడుస్తూ దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించే శక్తులపై పోరాటం కొనసాగిస్తాను అని తెలిపారు.