India Alliance: ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయా..?

రాజకీయాల్లో మిత్రులు శత్రువులు శాశ్వతం కాదు. ఇవాళ వ్యతిరేకించే వాళ్లు రేపు పక్కన చేరొచ్చు. అలాగే ఇప్పడు మనతో ఉన్న వాళ్లు రేపు మనల్ని విభేదించి వెళ్లిపోవచ్చు. ఇది రాజకీయాల్లో చాలా సహజం. ఎన్నో ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇండియా కూటమిలో (INDIA Alliance) కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆ కూటమికి బీటలు వారుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని ఈ కూటమి నుంచి పలు పార్టీలు తప్పుకునే దిశగా సంకేతాలిస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరాటం చేయాల్సిన పరిస్థితి ఖాయం.
భారతీయ జనతా పార్టీ (BJP) దేశంలో దూసుకుపోతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అందరూ అనుకున్నారు. అయితే బీజేపీని ఎలాగైనా అధికారానికి దూరం చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు పనిచేసింది. తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటితో కలిసి కూటమి కట్టింది. ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసింది. ఇందులో 37 పార్టీలున్నాయి. ఇవన్నీ ఎన్నికల ముందు మంచి సమన్వయంతో పని చేశాయి. దీంతో బీజేపీని దాదాపు ఓడించినంత పని చేశాయి. మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి.
అయితే హర్యానా (Haryana) , మహారాష్ట్ర (Maharashtra) ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా హర్యానాలో తాము కోరిన ఐదు సీట్లను కాంగ్రెస్ ఇవ్వలేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అలిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) తాము ఒంటరిగా పోటీ చేస్తామని అప్పట్లోనే అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఆ రెండుపార్టీల గెలుపోటములపై ఇది ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆప్ తిరుగులేని విజయం సాధించింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని సర్వేలు చెప్తున్నాయి.
మరోవైపు.. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న ఆప్ కు కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్ వాదీ పార్టీలు (SP) మద్దతు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు త్వరలో జరిగే బీహార్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆర్జేడీ సంకేతాలిచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీహార్లోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ (RJD Chief Tejaswi Yadav) సూచించారు. దీన్నిబట్టి తమది ఒంటరిపోరేనని తెల్చేశారు. అంతేకాక.. ఇండియా కూటమి ఏర్పాటు లోక్ సభ ఎన్నికలకోసం మాత్రమే ఏర్పడిందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా (J&K CM Omar Abdullah) కూడా ఇండియా కూటమి ఉనికిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడా కూటమి నాయకుడెవరని ప్రశ్నించారు. మొత్తంగా కూటమిలోని ప్రధాన పార్టీలన్ని కాంగ్రెస్ కు దూరంగా వెళ్లిపోతున్నాయి. దీంతో ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.