BJP: బీజేపీ సంచలన నిర్ణయం.. మహిళకు అధ్యక్ష బాధ్యతలు..!?

భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జె.పి.నడ్డా (JP Nadda) గడువు 2023 జనవరిలో ముగిసినప్పటికీ… పలు కారణాల రీత్యా ఆయన పదవీకాలం పొడిగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు (BJP National President Election) జరగబోతున్నాయి. పార్టీ తదుపరి అధ్యక్షురాలిగా ఒక మహిళను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari), తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ (Vanathi Srinivasan) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఈ పదవి దక్కినా బీజేపీ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మద్దతు ఉన్నట్లు సమాచారం. ఇది దక్షిణ భారతంలో పార్టీ విస్తరణకు, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు.
నిర్మలా సీతారామన్ ప్రముఖ ఆర్థిక నిపుణురాలు. బీజేపీ సీనియర్ నాయకురాలు. ఆమె 2019 నుంచి కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా, అంతకుముందు 2017-2019 మధ్య రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆమె భారతదేశపు మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా రెండో మహిళా రక్షణ మంత్రిగా పని చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ లో ఎం.ఎ., ఎం.ఫిల్ చేసిన ఆమె, 2006లో బీజేపీలో చేరి 2010లో జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి, 2016 నుంచి కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నాయకత్వం దక్షిణ భారతంలో బీజేపీ విస్తరణకు దోహదపడవచ్చని భావిస్తున్నారు. ఆమె ఎనిమిది సార్లు యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు. మొరార్జీ దేశాయ్ తర్వాత నిర్మలా సీతారామన్ ఈ ఘనత సాధించారు.
ఇక దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకురాలు. కొన్నిరోజుల క్రితం వరకూ ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు. ఆమె తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు కుమార్తె. చెన్నైలోని సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి సాహిత్యంలో బి.ఎ. పూర్తి చేసిన ఆమె, జెమాలజీలో డిప్లొమా కూడా సాధించారు. ఆమె ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ, ఫ్రెంచ్ భాషలలో నిష్ణాతురాలు. 2009లో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా, 2012లో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా 2014లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
వనతి శ్రీనివాసన్.. తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు కూడా.! న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన ఆమె 1993లో బీజేపీలో చేరారు. తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షురాలిగా పలు కీలక పదవులు నిర్వహించారు. ఆమె నాయకత్వంలో మహిళా మోర్చా అనేక విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నాయకుల నుంచి ప్రశంసలు లభించాయి. కోయంబత్తూరులో ఆమె రాజకీయ ప్రభావం, మహిళా ఓటర్లలో ఆమె ఆకర్షణ ఆమెను ఈ పదవికి బలమైన అభ్యర్థిగా నిలిపింది.
ఈ ముగ్గురు నాయకురాళ్లు దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన వాళ్లే. దక్షిణ భారతంలో పార్టీ పట్టును బలోపేతం చేయడం, మహిళా ఓటర్లను ఆకర్షించడం దీని వెనుక లక్ష్యంగా కనిపిస్తోంది. లోక్‌సభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దృష్ట్యా ఈ నిర్ణయం రాజకీయంగా కీలకమైనదిగా భావిస్తున్నారు. RSS మద్దతుతో ఓ మహిళకు పట్టం కట్టేందుకు బీజేపీ సిద్ధమైందని సమాచారం. అయితే నిర్మలా సీతారామన్, పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ మధ్య ఎవరు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని అలంకరిస్తారనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది.