TVK: విజయ్ కు అండగా అన్నాడిఎంకే, పొత్తుఫిక్స్..?

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాల దిశగా అడుగులు పడుతున్నాయి. అధికార డిఎంకే(DMK)ని కట్టడి చేసేందుకు ఇప్పుడు ప్రతిపక్షాలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు విడివిడిగా అధికార పార్టీపై పోరాటం చేసిన అన్నడీఎంకే, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలు ఇప్పుడు ఏకం కాబోతున్నాయి. వచ్చేయడాది జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి(Palani Swamy) క్లారిటీ ఇచ్చారు.
తాజాగా కుమారపాలెంలో జరిగిన ర్యాలీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే జెండాలను పళని స్వామి ప్రదర్శించారు. పొత్తు పై పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన ఆయన, కుమారపాలెం నుంచి డిఎంకెపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊహించని విధంగా గెలుపుంటుందని, విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక దీనిపై అన్నాడీఎంకే(AIDMK) నేతలు పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత పొత్తుపై ప్రకటన చేస్తామని.. విజయ్ పార్టీకి సంస్థ గత నిర్మాణం లేదని, తమతో కలిసి ముందుకు వెళితే పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకునే అవకాశం విజయ్ కి లభిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.
పొత్తు ద్వారా ముందుకు వెళితే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తమ పార్టీ చూసుకుంటుందని భరోసా ఇస్తున్నారు. అధికార పార్టీపై పోరాటం చేయాలి అంటే, ఇదే సరైన మార్గమని అన్నాడిఎంకె నేతలు వ్యాఖ్యానిస్తున్న సమయంలో, పళని స్వామి జెండాలను ప్రదర్శించడం సంచలనమైంది. దీనితో ఈ రెండు పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పళని స్వామి విజయ్ కి ఫోన్ చేసి కరూర్ ఘటనపై సంతాపం తెలిపారు. అటు అధికార డిఎంకె.. విజయ్ ని టార్గెట్ చేస్తున్న సమయంలో అన్నాడిఎంకే ఆయనకు అండగా నిలబడింది. కాగా గత కొన్ని రోజుల నుంచి విజయ్ సొంతగా పోటీ చేస్తామని ప్రకటిస్తున్న సమయంలో, ఈ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. కరూర్(Karur) ఘటన తర్వాత విజయ్ కాస్త ఒత్తిడిలోకి వెళ్ళినట్లుగా కనబడుతోంది.