Amit Shah : ఆయన చరిత్ర అస్సాంకు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా : అమిత్ షా

అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా నిర్బంధాలను ఎదుర్కొన్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. విద్యార్థిగా ఉన్నపుడు నిర్వహించిన ఆందోళన కారణంగా తనని జైల్లో (Jail) పెట్టారని, తనపట్ల కఠినంగా వ్యవహరించారని పేర్కొన్నారు. డెర్గావ్‌లోని లచిత్ బర్పుకాన్ పోలీసు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా తన విద్యార్థి జీవితాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు.
అస్సాంలో హితేశ్వర్ సైకియా (Hiteshwar Saikia )ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi )కి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఆందోళన నిర్వహించాం. అప్పట్లో నన్ను 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. నా పట్ల కఠినంగా వ్యవహరించారు. నాపై భౌతికంగా దాడి చేశారు కూడా అని అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అస్సాంలో శాంతికి ఏమాత్రం కృషి చేయలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో రాష్ట్రంలో శాంతభద్రతలు మెరుగయ్యాయని చెప్పారు. 10 వేల మంది యువత ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు. ఈ పోలీసు అకాడమీకి లచినత్ బర్పుకన్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ (Himanta Biswa Sharma )కు కృతజ్ఞతలు తెలిపారు. మొఘలుల సామ్రాజ్యకాంక్షను, వారి దాష్టీకాలను ఎదుర్కొన్న వారిలో లచిత్ బర్ఫుకన్ ఒకరు. ఆయన చరిత్ర కేవలం అస్సాంకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఉంది అని అన్నారు.