Amit Shah: పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు: రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్

లోక్‌సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కౌంటర్ ఇచ్చారు. సభా కార్యకలాపాలు నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘‘పార్లమెంటులో మాట్లాడటానికి నియమాలు ఉంటాయి. అవి ఆయనకు తెలియకపోవచ్చు. బడ్జెట్ చర్చల్లో మొత్తం 42 శాతం సమయం రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కేటాయించాం. అయితే, చర్చ జరుగుతున్న సమయంలో ఆయన వియత్నాంలో ఉన్నారు. తిరిగి వచ్చి మాట్లాడతానంటూ పట్టుబట్టడం సరికాదు. పార్లమెంటు అంటే వారి పార్టీ కార్యాలయం కాదు. ఇది నిబంధనల ప్రకారమే నడుస్తుంది. ప్రతిపక్ష నేతలు కూడా సభా నియమాలను గౌరవించాలి,’’ అని షా (Amit Shah) పేర్కొన్నారు.
అలాగే, దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి నెలకొందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన షా (Amit Shah).. నిజంగా ఎమర్జెన్సీ ఉంటే కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారని చురక వేశారు. కర్ణాటకలో కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని షా తప్పుబట్టారు. ‘‘ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ప్రాతిపదికన కాంట్రాక్టులు కేటాయించడం అన్యాయమని’’ విమర్శించారు. ఇదే సందర్భంలో తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు.