Amit Shah: అవినీతిని దాచిపెట్టేందుకు భాషా వివాదాలు.. డీఎంకేపై అమిత్ షా పరోక్ష విమర్శలు

హిందీ ఏ భాషకు పోటీ కాదని, ఇది అన్నింటికీ సోదర భాష వంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. కొన్ని పార్టీలు భాషను కేవలం రాజకీయ లబ్ధి కోసమే సమస్యగా మారుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అవినీతిని దాచిపెట్టేందుకు ఈ పార్టీలు భాషను ఆయుధంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. దేశంలో భాష ఆధారంగా గతంలో జరిగిన విభజనను మరోసారి జరగనివ్వబోమని షా స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన (Amit Shah).. కొన్ని పార్టీలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భాషను వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా వివాదాల పేరుతో అవినీతిని కప్పిపుచ్చుకోవాలన్న కుట్రలు విఫలమవుతాయని హెచ్చరించారు. భారతదేశంలోని ప్రతి భాషను సంపదగా భావించాలన్నదే కేంద్ర ప్రభుత్వం వైఖరి అని ఆయన స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం రాజ్యభాషా విభాగాన్ని ఏర్పాటు చేసి, అన్ని ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం అందిస్తున్నట్టు షా వివరించారు. తెలుగు, తమిళం, పంజాబీ, అస్సామీ వంటి భాషలకు ప్రాచుర్యం కల్పించడమే దీని లక్ష్యమని చెప్పారు. కొన్ని వర్గాలు కేంద్రం దక్షిణాది భాషలకు వ్యతిరేకమని చేస్తున్నాయని మండిపడ్డారు. “నేను (Amit Shah) గుజరాత్‌కు చెందినవాడిని, నిర్మలా సీతారామన్ తమిళనాడు వాసి. కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిని వ్యతిరేకిస్తే మేము మంత్రులుగా ఎలా ఉంటాం?” అని షా ప్రశ్నించారు. అదే సమయంలో తమిళనాడులో ఇంజినీరింగ్, మెడికల్ విద్యను తమిళంలోనే అందించాలని గత రెండు సంవత్సరాలుగా కోరుతున్నామని, కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని షా విమర్శించారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మెడికల్, ఇంజినీరింగ్ విద్యను తమిళంలో అందిస్తామని అమిత్ షా (Amit Shah) హామీ ఇచ్చారు.