Amit Shah: బిహార్‌లో అభివృద్ధి కావాలా? ఆటవిక రాజ్యం కావాలా?: అమిత్ షా

కాంగ్రెస్, దాని మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (RJD)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) పాలన బిహార్ ప్రగతిని దారుణంగా వెనక్కి తీసుకెళ్లిందని షా ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేశాయని ధ్వజమెత్తారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని చెప్పారు.
“కాంగ్రెస్ హయాంలో నెలకొన్న ఆటవిక రాజ్యం కావాలా, లేక ప్రస్తుత అభివృద్ధి రాజ్యం కావాలా?” అని అమిత్ షా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ (Congress) పాలనలో దశాబ్దాలుగా అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. “కాంగ్రెస్ 65 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని మోదీ కేవలం పదేళ్లలో చేసి చూపించారు” అని షా (Amit Shah) అన్నారు. బిహార్‌కు ఎన్డీఏ ఇచ్చిన ప్రాధాన్యతను కూడా షా వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే రూ. 9 లక్షల కోట్లను కేటాయించిందని, ఈ నిధులతో 13 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తున్నారని ఆయన (Amit Shah) చెప్పారు. అదనంగా, రూ. 8,000 కోట్ల వ్యయంతో ఏడు ప్రధాన బ్రిడ్జిలు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిహార్ సీఎం, జేడీయూ (JDU) అధినేత నీతీశ్ కుమార్ (Nitish Kumar) కూడా పాల్గొన్నారు. గతంలో తాను రెండు సార్లు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నానని అంగీకరించిన ఆయన.. ఇకపై ఎప్పటికీ ఎన్డీఏ కూటమిని వీడబోనని స్పష్టం చేశారు.