Justice Yashwant Varma: జడ్జి ఇంట్లో నోట్లకట్టలు దొరికిన కేసుపై అఖిలపక్ష సమావేశం.. హాజరైన న్యాయమంత్రి

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) నివాసంలో భారీ మొత్తంలో నగదు బయటపడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు కాగా, విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ‘‘ఇది (Justice Yashwant Varma) సున్నితమైన అంశం. అన్ని పార్టీలతో చర్చించడం అవసరం. రాజ్యసభ పక్ష నేతలు హాజరై సమగ్రంగా చర్చించాలని కోరుతున్నా’’ అని ధన్‌ఖర్ తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, బీజేడీ, బీఆర్ఎస్, వైయస్సార్‌సీపీ, శివసేన (యూబీటీ) నేతలు, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా పాల్గొన్నారు. జడ్జి (Justice Yashwant Varma) ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన అంశాన్ని తమతమ పార్టీలతో చర్చించాలని, తర్వాత మరోసారి జరిగే అఖిలపక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మను (Justice Yashwant Varma) అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. నోట్ల కట్టలతో తనకు సంబంధం లేదని వర్మ స్పష్టం చేశారు. తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఏ రకంగా కూడా ఆ నగదును దాచలేదని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కావాలనే ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.