Akhilesh Yadav-Amit Shah: ఐదుగురిలోనే ఒకరు.. అఖిలేశ్‌కు చురకలేసిన అమిత్ షా

వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ హాస్యాస్పద వాగ్వాదానికి వేదికైంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. బీజేపీ అధ్యక్ష ఎన్నికల గురించి అఖిలేశ్ వేసిన సెటైర్‌కు అమిత్ షా వ్యంగ్యంగా స్పందించారు. అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మాట్లాడుతూ, “ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ.. తమ అధ్యక్షుడిని మాత్రం ఎన్నుకోలేకపోతోంది” అంటూ సెటైర్ వేశారు. దీనికి నవ్వుతూ సమాధానం ఇచ్చిన అమిత్ షా (Amit Shah).. “అఖిలేశ్ జీ నవ్వుతూ మాట్లాడారు, నేను కూడా నవ్వుతూనే సమాధానం ఇస్తాను. కొన్ని పార్టీల్లో నాయకత్వం కేవలం ఐదుగురి చేతుల్లోనే ఉంటుంది. వాళ్లలోనే ఎవరో ఒకరు పార్టీ అధ్యక్షుడు అవుతారు. కానీ మేం ఓ ప్రక్రియను పాటించాలి. మా పార్టీకి 12-13 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటే సమయం పడుతుంది. మీకు మాత్రం ఎలాంటి ఆలస్యం ఉండదు, ఎందుకంటే మరో 25 ఏళ్ల పాటు మీరే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు!” అని చురకలు అంటించారు.