Akhilesh Yadav: ఈడీని రద్దు చేస్తే మంచిది: అఖిలేష్ యాదవ్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈడీ ఏర్పాటైందని, ఇప్పుడు అదే సంస్థ నుంచి కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం ఇతర సంస్థలు ఉన్నందున ఈడీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒడిశాలో పర్యటిస్తున్న అఖిలేష్ యాదవ్.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తుండటంపై ఈ విధంగా స్పందించారు. “నేషనల్ హెరాల్డ్ కంటే ఈడీ గురించి మాట్లాడతాను. ఈడీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. కానీ అదే సంస్థతో ఇప్పుడు ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వంటి అనేక సంస్థలు ఉన్నాయి. అందుకే ఈడీ అవసరం లేదు. దాన్ని రద్దు చేయాలి” అని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ మోడల్ ఎంతవరకు విజయం సాధించిందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఉత్తరప్రదేశ్‌లో రెండు ఇంజిన్లు వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నాయని ఆయన విమర్శించారు. ఒడిశాలో ఏం జరుగుతోందో తనకు తెలియదని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని అఖిలేష్ (Akhilesh Yadav) విమర్శించారు.