Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB షాకింగ్ రిపోర్ట్..!!

జూన్ 12న అహ్మదాబాద్‌లోని (Ahmedabad) సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు (London) బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం (విమానం నంబర్ AI-171) టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. భారత వైమానిక చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నమోదైంది. ఈ దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 260 మంది మరణించారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే అద్భుతంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై భారత వైమానిక ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) తాజాగా 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఇందులో ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి.
AAIB నివేదిక ప్రకారం, విమానం జూన్ 12 మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం రన్‌వే 23 నుంచి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే విమానం గరిష్ఠ వేగం 180 నాట్ల (330 కి.మీ/గంట)ను అందుకుంది. అయితే, టేకాఫ్ అయిన 65 సెకన్లలోనే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ప్రకారం.. 2 ఇంజిన్లలోని ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్‌లు “RUN” నుంచి “CUTOFF” స్థితికి ఒక సెకను వ్యవధిలో మారాయి. దీంతో రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. విమానం గాలిలో ఎగరలేక కూలిపోయింది.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటా ప్రకారం, ఇంజిన్లు ఆగిపోయిన కొద్ది సెకన్లలో ఒక పైలట్ మరొక పైలట్‌ను “ఎందుకు కటాఫ్ చేశావు?” అని ప్రశ్నించగా, రెండో పైలట్ “నేను కటాఫ్ చేయలేదు” అని సమాధానం చెప్పాడు. ఈ సంభాషణ జరిగిన కొద్ది క్షణాల్లోనే, మధ్యాహ్నం 1:39 గంటలకు పైలట్లు “మేడే, మేడే, మేడే” అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు డిస్ట్రెస్ కాల్ ఇచ్చారు. అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందించినప్పటికీ, పైలట్ల నుంచి మరింత సమాచారం రాలేదు. విమానం విమానాశ్రయ గోడను దాటే ముందే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ సముదాయంపై కూలిపోయింది. దీనివల్ల భారీ పేలుడు సంభవించి 241 మంది ప్రయాణికులు, 19 మంది భూమిపై ఉన్నవారు మరణించారు.
AAIB నివేదికలో విమానంలో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని, పక్షి ఢీకొనడం లేదా వాతావరణ సమస్యల వంటివి ఈ ప్రమాదానికి కారణం కాదని స్పష్టం చేసింది. సీసీటీవీ ఫుటేజీలో కూడా పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కనిపించలేదు. విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్‌లు, స్లాట్‌లు సరిగ్గా విస్తరించి ఉన్నాయని, ల్యాండింగ్ గేర్ రిట్రాక్షన్ ప్రక్రియ మధ్యలో ఆగిపోయిందని నివేదిక తెలిపింది. రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) ఆటోమేటిక్‌గా డిప్లాయ్ అయినట్లు కనిపించింది. ఇది ఇంజిన్ పవర్ లేదా ఎలక్ట్రికల్ వైఫల్యాన్ని సూచిస్తుంది.
ప్రమాదం జరిగిన వెంటనే AAIB దర్యాప్తు ప్రారంభించింది. బ్లాక్ బాక్స్ లలో ఒకటైన ఫ్లైట్ డేటా రికార్డర్ జూన్ 13న శిథిలాల నుంచి సేకరించగా, రెండో రికార్డర్ జూన్ 16న లభ్యమైంది. దెబ్బతిన్న రెండో రికార్డర్ నుంచి డేటా సేకరించడం సాధ్యపడలేదు. కానీ మొదటి రికార్డర్ డేటాను దిల్లీలోని AAIB ల్యాబ్‌లో విజయవంతంగా డీకోడ్ చేశారు. శిథిలాలను విమానాశ్రయం సమీపంలోని సురక్షిత స్థలానికి తరలించారు. రెండు ఇంజిన్లతో సహా కీలక భాగాలను హ్యాంగర్‌లో భద్రపరిచారు. బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్ (GE), యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), యూకే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ నిపుణులు ఈ దర్యాప్తులో సహకరిస్తున్నారు.
AAIB నివేదికలో 2018లో FAA జారీ చేసిన ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్ సేఫ్టీపై అడ్వైజరీని ఎయిర్ ఇండియా అమలు చేయలేదని పేర్కొన్నారు, ఈ అడ్వైజరీ “నాన్-మాండేటరీ”గా ఉండటం వల్ల దీనిని నిర్లక్ష్యం చేశారు. అయితే, విమానం ఎయిర్‌వర్థీగా ఉందని, దాని ఆర్‌వర్థీనెస్ రివ్యూ సర్టిఫికేట్ మే 2026 వరకు చెల్లుబాటులో ఉందని నివేదిక స్పష్టం చేసింది.
ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించిన మొదటి ఘోరమైన దుర్ఘటనగా నిలిచింది. AAIB ప్రాథమిక నివేదిక ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్‌ల సమస్యను కీలక కారణంగా చూపింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా, అనుకోకుండా లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనేది తదుపరి దర్యాప్తులో తేలనుంది. ఈ ఘటన భారత వైమానిక రంగంలో భద్రతా ప్రమాణాలపై మరింత చర్చకు దారితీసింది.