Cuba: ఆర్థిక బలానికి లొంగడం జరగదు.. ట్రంప్‌కు స్పష్టం చేసిన క్యూబా!
వెనిజులా నుంచి క్యూబాకు (Cuba) వచ్చే చమురు, ఆర్థిక సహాయాన్ని అడ్డుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన హెచ్చరికలపై క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ (Miguel Díaz-Canel) దీటుగా స్పందించారు. అగ్రరాజ్యం ప్రదర్శిస్తున్న జులుంపై ఆయన మండిపడ్డారు. దేశాల మధ్య సంబంధాలు నిలవాలంటే అవి అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉండాలే తప్ప, బెదిరింపులు లేదా ఆర్థిక ఆంక్షల (Sanctions) ద్వారా జరగదని హితవు పలికారు.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంతో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరగడం లేదని క్యూబా (Cuba) ప్రెసిడెంట్ మిగెల్ స్పష్టం చేశారు. అయితే పరస్పర ప్రయోజనాలు, ఒకరినొకరు గౌరవించుకునే వాతావరణం ఉంటే బాధ్యతాయుతమైన చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం మానుకుని, తమ దేశ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్ని గౌరవించడం కనీస ధర్మమని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కేవలం ఆర్థిక బలం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఆధారంగా నడుచుకుంటేనే అమెరికా-క్యూబా (Cuba) సంబంధాలు ముందుకు సాగుతాయని క్యూబా అధినేత తేల్చిచెప్పారు.






