Washington: అమెరికాలో దారుణం.. త్వరలో నిశ్చితార్థం ..అంతలోనే

గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులు తీవ్రతరమవుతున్న వేళ అమెరికా(America)లో దారుణం జరిగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ (Washington) లో యూదు మ్యూజియంలో జరిగిన యువ దౌత్యవేత్తల కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న యారోన్ లిషిన్‌స్కీ (Yaron Lisinsky), సారా మిలిగ్రిమ్ (Sarah Miligrim) పై చాలా దగ్గర నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడే తుదిశ్వాస విడిచారు. అనంతరం దుండగుడు మ్యూజియంలోనికి వెళ్లగా అక్కడ భద్రతా అధికారులు అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు ఫ్రీ ఫ్రీ పాలస్తీనా అంటూ నినాదాలు చేశాడని అధికారులు తెలిపారు. నిందితుడిని షికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్ (Elias Rodriguez)గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. యూదులపై విద్వేషంతోనే ఈ హత్య జరిగిందని అన్నారు. ద్వేషానికి, అతివాదానికి అమెరికాలో స్థానంలో లేదని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాల్పుల్లో మృతి చెందిన యువ జంట యారోన్ లిషిన్‌స్కీ, సారా మిలిగ్రిమ్ త్వరలో నిశ్చితార్థం చేసుకోవాలని అనుకున్నారని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది. లిషిన్‌స్కీ తన స్నేహితురాలి కోసం ఉంగరం కూడా కొన్నారని, నిశ్చితార్థం జెరూసలేంలో చేసుకోవాలని యువ జంట భావించిందని ఇజ్రాయెల్ రాయబారి యహియల్ లైటర్ తెలిపారు. వారిది అందమైన జంట అని పేర్కొన్నారు.