White house: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగదని ట్రంప్ సంకేతాలు… ఆంక్షల హెచ్చరికలు

ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ఆగుతుందంటూ నిన్నటి వరకూ ఆశాభావం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆలస్యంగా వాస్తవం అర్థమైనట్లు కనిపిస్తోంది. రష్యా(Russia), ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్, జెలెన్‌స్కీలతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటుచేయడం.. నూనె, వెనిగర్‌లను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగింపు విషయంలో వారు కలిసి పనిచేస్తారా లేదా అనే విషయంపైనా తనకు స్పష్టత లేదన్నారు. భవిష్యత్తులో వారిద్దరి మధ్య జరిగే సమావేశానికి తాను హాజరవుతానో, లేదో కూడా తెలియదన్నారు. ఉక్రెయిన్‌లోని అమెరికాకు చెందిన ఫ్యాక్టరీపై రష్యా దాడులు చేయడంపైనా ట్రంప్ మండిపడ్డారు. ఈ విధమైన రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాస్కో భారీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
యుద్ధం ముగింపునకు తాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పుతిన్ తీసుకుంటున్న చర్యలతో తాను ఏమాత్రం సంతోషంగా లేనని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. యుద్ధం విషయంలో జెలెన్‌స్కీ, పుతిన్‌ల వైఖరి తెలుసుకోవడానికి తనకు రెండు వారాల సమయం పడుతుందని.. అప్పటిలోపు వారు ఓ ఒప్పందానికి రాకపోతే ఈ విషయంలో తానే నిర్ణయం తీసుకుంటానన్నారు ట్రంప్.. అది భారీ ఆంక్షలా లేదా సుంకాలా లేకపోతే రెండూనా అనేది తెలియజేస్తానని పేర్కొన్నారు. మాస్కో-కీవ్ మధ్య శాంతిచర్చల ప్రయత్నాలు ముమ్మరం చేసిన ట్రంప్.. ఇటీవల అలాస్కాలో పుతిన్‌తో వాషింగ్టన్‌లో జెలెన్‌స్కీ, యూరప్ దేశాల నేతలతో చర్చలు జరిపారు.
మరోవైపు పుతిన్.. ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన డిమాండ్ల సాధనపైనే ఆయన ఫోకస్ పెట్టారు. దీంతో ట్రంప్ చెబుతున్న మాటలకు పెద్దగా ప్రాముఖ్యత కనిపించడం లేదు. మరోవైపు.. జెలెన్ స్కీ సైతం తమ డిమాండ్లను ట్రంప్ ముందుంచారు. జెలెన్ స్కీకి యూరప్ నేతలు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. దీంతో ఈ విషయంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోవడానికి కుదరడం లేదు. దీంతో ట్రంప్ నోటి వెంట ఇలాంటి నిరాశాకరమైన మాటలు వస్తున్నాయని అమెరికన్ మాజీ దౌత్యవేత్తలు చెబుతున్నారు.