Embassies : త్వరలో 30 ఎంబసీలు, కాన్సులేట్ల మూసివేత!

విదేశాల్లోని దాదాపు 30 రాయబార కార్యాలయాల (Embassies)ను, కాన్సులేట్ల (Consulates)ను మూసివేయాలని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం చూస్తోంది. విదేశాల్లో తమ దౌత్య విధానాల మార్పుల్లో భాగంగా ఈ చర్య చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా సోమాలియా(Somalia), ఇరాక్ (Iraq)ల లోని కార్యాలయాలను మూసివేయాలనే సిఫారసులు ఆ పత్రాల్లో ఉన్నాయి. ఈ పత్రాలపై విదేశాంగ మంత్రి రుబియో సంతకాలు చేశారా లేదా అన్నది తెలియరాలేదు. ఈ పత్రాల్లోని వివరాల ప్రకారం 18 ఎంబసీలను, 17 కాన్సులేట్లను ట్రంప్ ప్రభుత్వం మూసివేయాలని భావిస్తోంది. వీటిలో ఎక్కువ భాగం ఐరోపా, ఆఫ్రికాల్లోనే ఉన్నాయి. ఆసియా, కరీబియన్‌లలో ఒక్కోటి ఉన్నాయి. మూసివేయాలని భావిస్తున్న ఎంబసీల్లో మాల్టా, లక్జెంబర్గ్, లెసోతో, రిపబ్లికన్ ఆఫ్ కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్ ఉన్నాయి. మూసివేయాలనుకుంటున్న కాన్సులేట్లలో 5 ఫ్రాన్స్‌లో, 2 జర్మనీలో, 3 బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా, 1 బ్రిటన్‌లో, ఒకటి దక్షిణాఫ్రికాలో, 1 దక్షిణ కొరియాలో ఉన్నాయి.