అమెరికాలో సిద్దిపేట యువకుడి అనుమానాస్పద మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళ్మిట్ట మండలం కూటిగల్‌కు చెందిన సాయి రోహిత్(23) 2022లో బీటెక్ పూర్తి చేశాడు. గతేడాది డిసెంబర్ 20న ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. నలుగురు మిత్రులతో ఒక రూమ్‌లో ఉంటూ వాషింగ్టన్‌లోని సియాటెల్ నగరంలోని యూనియన్ కాలేజీలో ఎంఎస్ చేస్తున్నాడు. జూలై 22న సాయంత్రం 5 గంటలకు క్యాబ్‌లో బయటకు వెళ్లిన సాయిరోహిత్, తిరిగి వస్తూ మార్గమధ్యలో వేరే క్యాబ్లోకి మారాడు. అప్పటి నుంచి రూమ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు అవినాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తానా ( తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సభ్యులకు కూడా సమాచారం అందించాడు. వారు, మిత్రులు వెతుకుతుండగా జూలై 24న సమ్మామిష్ సరస్సులో సాయిరోహిత్ మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని జూలై 25న కుటుంబ సభ్యులకు చెప్పారు. కాగా, సాయిరోహిత్ మృతిపై కుటుంబసభ్యులు, గ్రామస్థులు, స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ మృతదేహం నేడు స్వగ్రామానికి చేరుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.






