Rohith Sharma: కెప్టెన్సీవద్దు, బోర్డుకు చెప్పేసిన రోహిత్…?
ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో ఘోరంగా విఫలమైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) బోర్డుకు కీలక సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఫామ్ లేక నానా అవస్థలు పడుతున్న రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. ఛాంపియన్ ట్రోఫీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలకు రాజీనామా చేస్తానని ఆటగాడిగా కొనసాగుతానని రోహిత్ శర్మ సమాచారం పంపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జాతీయ జట్టులో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టి తిరిగి ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేశాడు.
అయితే అనుకున్న విధంగా పరిస్థితి లేకపోవడంతో రోహిత్ శర్మ కూడా ఒత్తిడి లోనే కనబడుతున్నాడు. ఇక రోహిత్ శర్మ ఏకాగ్రత కూడా తగ్గిందని వయసు పెరగడంతో అతనిలో ఆడే సత్తా లేదని బోర్డు పెద్దలు కూడా భావిస్తున్నారు. అయితే రోహిత్ శర్మ మాత్రం ఆటగాడిగా కొనసాగేందుకు ఇష్టపడుతున్నాడు. ఛాంపియన్ ట్రోఫీ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి తర్వాత టెస్ట్ క్రికెట్లో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి బోర్డు పెద్దలతో రోహిత్ శర్మ సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి.
2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో మూడు డబల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డులు సృష్టించాడు. ఇక ఐసిసి టోర్నమెంట్లలో రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. గత వన్డే ప్రపంచ కప్ లో అలాగే గత ఎడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో బ్యాటింగ్ లో రోహిత్ శర్మ రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అలాగే న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన సీరిస్ లో మాత్రం రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అటు టెస్ట్ క్రికెట్లో కెప్టెన్ గా కూడా విఫలం కావడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.






