అమెరికా పర్యటన ముగించుకుని… సియోల్ చేరుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకున్నారు. ఆయన అక్కడ రెండురోజుల పాటు వివిధ దేశ, విదేశీ ప్రతినిధులను కలుసుకోనున్నారు. ఎనిమిది రోజుల పాటు అమెరికాలో జరిగిన పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశాల ఫలితంగా 19 కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా వాణిజ్య సంస్థలతో సమావేశమైందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశగా పలు సంస్థలు సంసిద్దత వ్యక్తం చేశాయని తెలిపింది.






