Russia: భారత్ ప్రపంచపవర్ గా ఎదుగుతోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గదన్న పుతిన్..!

చిరకాల మితృత్వం ఓవైపు.. వాణిజ్యంలో టెంప్టింగ్ డీల్ మరోవైపు.. అందుకే అమెరికా ఎంతగా ఒత్తిడి తెస్తున్నా రష్యా (Russia) విషయంలో భారత్ తన వైఖరి మార్చుకోవడం లేదు. రష్యా నుంచి భారీ స్థాయిలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది కూడా. అయితే ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) నుంచి ఆయన అధికార యంత్రాంగం వరకూ అందరూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. తాము చెప్పినట్లు వినడం లేదన్న అక్కసుతో భారీగా టారిఫ్ లు విధిస్తున్నారు కూడా. అయితే అమెరికా ఎంతగా ఒత్తిడి తెస్తున్నా భారత్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.
మరోవైపు..రష్యాతో ఇంధన వాణిజ్యం తగ్గించుకోవాలంటూ భారత్‌పై అమెరికా తెస్తున్న ఒత్తిడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ ఎన్నటికీ బయటి శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గదని, అలాంటి అవమానాన్ని ఎప్పటికీ సహించదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా వెనక్కి తగ్గకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే భారీ నష్టం తప్పదని గట్టిగా హెచ్చరించారు.
రష్యాలోని సోచి నగరంలో జరిగిన వాల్డాయ్ అంతర్జాతీయ చర్చా వేదికలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి భారత్ సహా 140 దేశాల నుంచి భద్రతా, భౌగోళిక రాజకీయ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ “భారత్‌తో మాకు ఎలాంటి సమస్యలు లేవు, ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తలేదు. ప్రధాని నరేంద్ర మోడీ నా స్నేహితుడు. ఆయన నాయకత్వంలో భారత్ ఎవరి ఒత్తిళ్లకూ లొంగదు. అమెరికా మాట విని రష్యా నుంచి ఇంధనం కొనడం ఆపేస్తే భారత్ దాదాపు 9 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నష్టపోవాల్సి వస్తుంది” అని వివరించారు.
అమెరికా చర్యలు ఆ దేశానికే నష్టం కలిగిస్తాయని పుతిన్ హెచ్చరించారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతాయని అన్నారు. ఇది అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి పెంచి, వడ్డీ రేట్లను అధికంగా ఉంచేలా చేస్తుందని, తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని విశ్లేషించారు.
భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకోవడం వల్ల ఏర్పడిన వాణిజ్య అసమతుల్యతను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని పుతిన్ హామీ ఇచ్చారు. “భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలను అధికంగా కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం” అని ఆయన తెలిపారు. డిసెంబర్ నెలలో జరగనున్న తన భారత పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు.