Greece: షిఫ్టుకు 13 గంటలు పనా..? కార్మికుల సమ్మెతో స్తంభించిన గ్రీస్..!

గ్రీస్ (Greece) లో కార్మిక లోకం రోడ్డెక్కింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు గ్రీస్ ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగింది. ముఖ్యంగా షిఫ్టులో పని గంటలను 13కు పెంచడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది.ఇందులో భాగంగా కార్మిక సంఘాలు 24 గంటల సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.
గ్రీస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక చట్ట సవరణల్లో షిఫ్టు పని గంటలను 13కు పెంచడం వంటి ఉన్నాయి. ఈ అదనపు పనిగంటలు వారానికి గరిష్ఠంగా 48 గంటలకు పరిమితి చేయగా, ఏడాదికి 150 గంటలకు మించకూడదని పేర్కొంది. వీటిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ హక్కులను అణచివేయడమే కాకుండా పని-జీవన సమతుల్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసన కారులు వీధుల్లోకి వచ్చారు. దీంతో ఏథెన్స్‌లో టాక్సీ, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆయా నగరాల్లో బస్సులు, ట్రామ్, ట్రాలీ సర్వీసులు మాత్రం పరిమిత స్థాయిలో సేవలందించాయి. పాఠశాలలు, కోర్టులు, ఆసుపత్రులు సహా ప్రభుత్వ సేవలకు అంతరాయం ఏర్పడింది.
రుణ సంక్షోభం నుంచి కోలుకున్నప్పటికీ ఈయూ సభ్యదేశాలతో పోలిస్తే గ్రీస్‌లో వేతనాలు తక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. కనిష్ఠ వేతనం నెలకు 880 యూరోలుగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కొంత పెంచినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువేనని, సరాసరి పనిగంటలు కూడా ఎక్కువగా ఉన్నాయని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 13-గంటల పని షిఫ్టు వర్తిస్తుందని చెబుతోంది.