Revanth Vs PK: రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిశోర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) వ్యవస్థాపకులు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) పగబట్టారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని శపథం చేశారు. మోదీ (Modi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) వచ్చినా రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు. గతంలో బీహారీలను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని ప్రశాంత్ కిశోర్ చెప్తున్నారు. బీహారీలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. లేకుంటే ఆయన్ను ఓడించే వరకూ తన పంతం కొనసాగుతుందున్నారు. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతోంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బీహారీలకు వ్యతిరేకంగా మాట్లాడారనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో కీలకమైన పరిపాలనా పదవులలో బీహార్ నేపథ్యం ఉన్న అధికారులను ఎక్కువగా నియమించడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన ఒక సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూలి పనులకోసం బీహారీలు ప్రపంచమంతా వెళ్తుంటారని, అలాంటి వాళ్లను కేసీఆర్ తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి అన్నట్టు సమాచారం. తెలంగాణ అధికారుల కంటే బీహారీ అధికారులు మెరుగైన వారా అని ప్రశ్నించినట్టు ఆరోపణలున్నాయి.
ప్రశాంత్ కిశోర్ ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. బీహార్ ప్రజల డీఎన్ఏలో కూలీ పని చేయడం ఉందని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీహారీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ప్రశాంత్ కిశోర్ ఖండించారు. వలస కార్మికులుగా దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి కష్టపడే బీహారీలను కించపరిచే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారని పీకే దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రశాంత్ కిశోర్ సీరియస్ గా తీసుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తన జన్ సురాజ్ పార్టీ తరపున 243 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను బరిలో దించుతున్నారు ప్రశాంత్ కిశోర్. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీకే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి నేతలు మాటలను హైలైట్ చేయడం ద్వారా బీహార్ సెంటిమెంటును మరింత రగిలించవచ్చు. ఇది ఎన్నికల్లో తన పార్టీ గెలుపునకు ఎంతో దోహదపడుతుంది. అదే సమయంలో బీహారీల ఆత్మగౌరవం కోసం పీకే పని చేస్తున్నారనే మంచి పేరు కూడా దక్కుతుంది.
మరోవైపు.. బీహార్ లో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడం కూడా ప్రశాంత్ కిశోర్ లక్ష్యంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ కు ముఖ్యనాయకుడిగా ఉన్నారు. అలాంటి నాయకుడిని టార్గెట్ చేయడం ద్వారా ఆ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు. ఇటీవల రాహుల్ గాంధీ బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టినప్పుడు రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. బీహార్ లో అడుగు పెట్టాలంటే రేవంత్ రెడ్డి బీహారీలకు క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పైన బీహారీ వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఇది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి నష్టం చేకూర్చవచ్చు.
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రేవంత్ రెడ్డిపై ప్రశాంత్ కిశోర్ మాటల దాడి పెంచారు. బీహార్ గ్రామాల్లోకి వస్తే, ప్రజలు రేవంత్‌ను కర్రలతో తరిమి కొడతారని హెచ్చరిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డిని ఆయన సొంత రాష్ట్రంలో, వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతానని శపథం చేశారు. అంతేకాక ఆ సమయంలో మోడీ, రాహుల్ గాంధీ కూడా రేవంత్ ను రక్షించలేరన్నారు. ఆయన బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ.. ఇలా అన్ని పార్టీలూ మారి అతి కష్టం మీద ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గతంలో తనను మూడుసార్లు సాయం కోరడానికి వచ్చారని, ఇప్పుడు తనను అవమానించిన వారిని రాజకీయంగా ఓడించి తీరాలని నిశ్చయించుకున్నానని పీకే పేర్కొన్నారు. మొత్తంగా, రేవంత్ రెడ్డి పాత వ్యాఖ్యలను పీకే ప్రధాన అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ ప్రజల ఆత్మగౌరవాన్ని మేల్కొలిపి, దానిని తన పార్టీ బలపడటానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.