Prince Aga Khan : ప్రిన్స్ ఆగాఖాన్ అస్తమయం
వివిధ దేశాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికంగా ఊతమిందించిన వదాన్యునిగా, ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ప్రసిద్ధి పొందిన ప్రిన్స్ ఆగాఖాన్ (Prince Aga Khan) (88) కన్నుమూశారు. ఆగాఖాన్ అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేనీ(Prince Karim Al Husseini). షియా ఇస్మాయిలీ ముస్లింల 49వ అనువంశిక ఇమామ్ ( ఆధ్యాత్మిక గురువు) అయిన ప్రిన్స్ కరీం అల్ హుసేనీ పోర్చుగల్(Portugal) లోని లిస్బన్లో తన కుటుంబ సభ్యుల మధ్య తుది శ్వాస విడిచారు అని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రకటించింది. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలో వెల్లడిస్తారు. ఆగా ఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పలువురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ప్రిన్స్ ఆగాఖాన్ తన వీలునామాలో పేర్కొన్న విధంగా ఆయన కుమారుడు రహీమ్ అల్ హుసేనీ (Rahim Al Husseini )ని ఆధ్మాత్మిక వారసునిగా ప్రకటించారు. అల్ హుసేనీ షియా ఇస్మాయిలీ ముస్లింల తదుపరి ఇమామ్‌గా వ్యవహరిస్తారు. ఆయనను అయిదో ఆగాఖాన్ అని పిలుస్తారు.






