Washington: అమెరికాలో విషాదం.. విమానం, హెలికాప్టర్ ఢీ
అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 64 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం.. మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ రెండూ పక్కనే ఉన్న పోటోమాక్(Potomac ) నదిలో కూలిపోయాయి. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే చాలా మృతదేహాలను వెలికితీశారు.
బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పీఎస్ఏ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. వాషింగ్టన్ (Washington) సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది (Passenger plane collides with Helicopter). ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానాన్ని.. స్థానికంగా పీఎస్ఏ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోంది. ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఇక, హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని రక్షణ శాఖ అది కారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. చాలా మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచించారు.






