Pakistan: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్… జర్మనీ రక్షణ వ్యవస్థ వైపు పాకిస్తాన్ చూపు..

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు తమ రక్షణ పాటవం ఎంత పేలవంగా ఉందో అర్థమైపోయింది. ముఖ్యంగా భారత్ బ్రహ్మాస్త్రం.. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ప్రతిదాడికి దిగిన పాకిస్థాన్‌ను గజగజా వణికించింది. ఆ దేశంలోని వైమానిక స్థావరాలను దెబ్బతీసింది. భారత్ ప్రతాపాన్ని ఎదుర్కోలేక పాక్ బిక్క మొహం వేసింది. చైనా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత్ అస్త్రాలను నిలువరించలేకపోయింది. దీంతో ఆ వ్యవస్థకు స్వస్తి పలికి.. జర్మనీ నుంచి అధునాతన రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని పాక్ అడుగులు వేస్తోంది
బ్రహ్మోస్ భయంతోనే…
ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణులను (BrahMos) ప్రయోగించినట్లు భారత్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, తమ వైమానిక స్థావరాలపై భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి భారత్ పూర్తిస్థాయిలో దాడి చేస్తే.. తట్టుకోలేమని పాక్ ముందుగానే గ్రహించింది. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణుల విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు పావులు కదుపుతోంది.
చైనా రక్షణ వ్యవస్థపై సన్నగిల్లిన నమ్మకం
పాకిస్థాన్ ప్రస్తుతం చైనా(China) నుంచి కొనుగోలు చేసిన హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగిస్తోంది. ఇటీవల భారత్ ప్రయోగించిన డ్రోన్, క్షిపణి దాడులను ఇవి నియంత్రించలేకపోయాయి. అంతేకాకుండా పాక్ చెబుతున్నట్లు ఒకవేళ భారత్ బ్రహ్మోస్ క్షిపణులను వినియోగించినా.. వాటిని ఎదిరించే సత్తా, ఈ రెండు రక్షణ వ్యవస్థలకు లేనట్లు తేలిపోయింది. ఈ నేపథ్యంలో కచ్చితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు పాక్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా రష్యా అలుపెరుగని యుద్ధం చేస్తున్నా.. సమర్థంగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్ వినియోగిస్తున్న గగనతల రక్షణ వ్యవస్థను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ సాంకేతికతను ఉక్రెయిన్.. జర్మనీ నుంచి కొనుగోలు చేసింది.
పాక్ చూపులు జర్మనీ వైపు
గత ఏడాదిలో రష్యా ప్రయోగించిన 60 క్షిపణులను సమర్థంగా నేలకూల్చినట్లు నెల రోజుల క్రితం ఉక్రెయిన్ ప్రకటించింది. జర్మనీ నుంచి కొనుగోలు చేసిన ఐరిస్-టి-ఎస్‌ఎల్‌ఎమ్ (IRIS-T-SLM) గగనతల రక్షణ వ్యవస్థను వినియోగించినట్లు తెలిపింది. డీల్ డిఫెన్స్ సంస్థ తయారుచేసిన ఈ వ్యవస్థ.. రష్యాకు చెందిన P-800 ఆనిక్స్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొంది. ఈ క్షిపణులకు, భారత్ రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులకు దగ్గరి పోలికలు ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. ఈనేపథ్యంలోనే వాటిని కొనుగోలు చేసేందుకు పాక్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒప్పందానికి అడ్డంకులెన్నో…?
ఐరిస్-టి-ఎస్‌ఎల్‌ఎమ్ కొనుగోలు కోసం డీల్ డిఫెన్స్ సంస్థతో పాకిస్థాన్ ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులువేం కాదు. ఆ సంస్థలో భాగస్వామ్యం ఉన్న థైసెన్‌క్రప్ మెరైన్ సిస్టమ్స్ అనే సంస్థ భారత్‌లోని వివిధ రక్షణ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సుమారు రూ.70 వేల కోట్లతో భారత్ 6 జలాంతర్గాములను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఆ రెండు సంస్థలు సంయుక్తంగా ఇంటరాక్టివ్ డిఫెన్స్ అండ్ అటాక్ సిస్టమ్స్ (ఐడీఏఎస్) సరఫరా చేస్తున్నాయి. అంతేకాకుండా భారత్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలతో డీల్ డిఫెన్స్‌కు కీలక ఒప్పందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్న భారత్‌ను కాదని, పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ సంస్థలు ముందుకువచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
గత నెలలో ఐఎంఎఫ్ నుంచి బిలియన్ డాలర్లు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి మరో 800 మిలియన్ డాలర్లను పాక్ అప్పు తీసుకుంది. ఈ పరిస్థితుల్లో పాక్ అంత భారీ మొత్తం చెల్లించి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటివరకు మద్దతిస్తున్న చైనా కూడా పాక్‌కు వ్యతిరేకంగా మారే అవకాశముంది.