America: అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పోషించాం : ఖవాజా ఆసిఫ్

ఉగ్రవాదమే తన అసలు ముఖమని పాకిస్థాన్ (Pakistan) ఎట్టకేలకు అంగీకరించింది. ఉగ్రవాదానికి దశాబ్దాలు గా అడ్డాగా మారినట్టు అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రే స్పష్టంగా ప్రకటన చేశారు. కనీసం 30 ఏళ్లుగా ఉగ్ర తండాలను పాక్ పెంచి పోషిస్తూ వస్తోందని మీడియాకు తెలిపారు. దాంతో ఈ విషయమై భారత్ (India )ఇంతకాలంగా చెబుతూ వస్తున్నది అక్షరసత్యమని నిరూపణ అయింది. ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif ) మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద సంస్థలకు దన్నుగా నిలిచిన సుదీర్ఘ చరిత్ర పాక్‌కు ఉంది. దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించగా, దానికి మంత్రి స్పందిస్తూ అవును. అది నిజమే అంటూ అంగీకరించారు. అయితే, అమెరికా(America), బ్రిటన్ (Britain), ఇతర పాశ్చాత్య దేశాల కోసమే మేం కనీసం 30 ఏళ్లు ఈ చెత్త పని చేస్తు వస్తున్నాం అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్ర పాపాన్ని అగ్ర దేశాలకూ అంటించే ప్రయత్నం చేశారు. తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులను అఫ్గాన్‌లో సోవియట్‌పై పోరుకు అమెరికా వాడుకుందని ఖవాజా ఆరోపించారు. మేం చేసింది నిజంగా దిద్దుకోలేని పోరపాటే. అందుకు పాక్ భారీ మూల్యమే చెల్లించుకుంది. పూడ్చుకోలేనంతగా నష్టపోయిందన్నారు.