Nirmala Sitharaman: అమెరికాతో అక్టోబరు కల్లా ఒప్పందం : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) పై అమెరికా ప్రభుత్వంతో భారత్ చాలా చురుగ్గా చర్చలు జరుపుతోందని, తొలి దశ ఒప్పందంపై ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబరు కల్లా సంతకాలు జరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు. అమెరికాతో చర్చల కోసం ఈ ఏడాదినే ప్రధాని మోదీ(Prime Minister Modi), వాణిజ్య మంత్రి గోయల్ (Minister Goyal) ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంకు(World Bank) సమావేశాల కారణంగా నేనూ వచ్చాను. వాణిజ్య, ఆర్థిక శాఖ మంత్రులను కలవాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీని ఆయన కలవనున్నారని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) తరహాలో బీటీఏ కుదుర్చుకోవాలని అమెరికా, భారత్ భావిస్తున్నాయని, రెండు దశల్లో బీటీఏ పూర్తి చేయాలన్నది లక్ష్యమని వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లు విధించారనే కారణంతో మేము అమెరికాతో చర్చలు జరపడం లేదు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా సాగుతోంది. దీన్ని మరింతగా పెంచుకునే దృక్పథంతో సాగుతున్నాం అని నిర్మల పేర్కొన్నారు.